వివాహ వేడుక నుంచి తిరిగి వస్తుండగా విషాదం గోవర్ధనగిరి వద్ద అదుపుతప్పి లోయలోకి దూసుకెళ్లిన కారు ఇద్దరు మృతి.. నలుగురికి తీవ్ర గాయాలు

జనగామ, జూన్ 14 (బీబీఎంఏ న్యూస్): జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం గోవర్ధనగిరి వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఓ డెంటల్ వైద్యురాలు, సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ మృతి చెందగా, మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు.

పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. హనుమకొండ జిల్లా నయీంనగర్‌కు చెందిన మహ్మద్ రహముద్దీన్ కుటుంబ సభ్యులు, బంధువులు కర్ణాటకలో జరిగిన వివాహ వేడుకకు హాజరై తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. గోవర్ధనగిరి దర్గా సమీపానికి రాగానే కారు అదుపుతప్పి రోడ్డుపక్కనున్న లోయలోకి దూసుకెళ్లింది.

ఈ ప్రమాదంలో రహముద్దీన్ కుమార్తె, డెంటిస్ట్ హబీబా హఫ్సా (27), బంధువైన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ మహ్మద్ అసదుద్దీన్ (26) అక్కడికక్కడే మృతి చెందినట్లు సమాచారం. ప్రమాదంలో మరో నలుగురు తీవ్రంగా గాయపడగా, వారిని చికిత్స నిమిత్తం సమీప ఆసుపత్రికి తరలించారు.

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

ఈ ఘటనతో మృతుల కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది.