పాలకొండ, జూన్ 14 (బీబీఎంఏ న్యూస్): మన్యం జిల్లా పాలకొండలో సంచలనం సృష్టించిన మాజీ వాలంటీర్ బిడ్డిక ఉషారాణి (32) హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు భువనేశ్వర్‌తో పాటు మరో ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు.
పోలీసుల కథనం ప్రకారం, భువనేశ్వర్ ఉషారాణితో ప్రేమ సంబంధం కొనసాగిస్తూనే, ఇద్దరు పిల్లలున్న స్టాఫ్ నర్సు కృపారాణితో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న ఉషారాణి తనను వివాహం చేసుకోవాలని ఒత్తిడి చేయడంతో నిందితులు ఆమెను అడ్డంకిగా భావించినట్లు దర్యాప్తులో వెల్లడైంది.
పథకం ప్రకారం భువనేశ్వర్, కృపారాణి, తేజేశ్వరరావు కలిసి ఉషారాణికి నిద్రమాత్రలు కలిపిన శీతల పానీయం ఇచ్చారు. అనంతరం ఆమె అపస్మారక స్థితిలోకి వెళ్లిన తర్వాత ఊపిరి ఆడకుండా చేసి హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు.
నేరాన్ని దాచిపెట్టేందుకు మృతురాలి చేతులను కట్టేసి, మృతదేహాన్ని సమీప చెరువులో పడవేసినట్లు విచారణలో తేలింది. సాంకేతిక ఆధారాలు, దర్యాప్తు ద్వారా నిందితులను గుర్తించి అరెస్టు చేసినట్లు పోలీసులు వెల్లడించారు.
నిందితులపై హత్య కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరచగా, తదుపరి దర్యాప్తు కొనసాగుతున్నట్లు పోలీసులు తెలిపారు.