గాలికుంటు, బ్రుసెలోసిస్ వంటి వ్యాధుల నివారణకు టీకాలే రక్షణ కవచం

హైదరాబాద్, జూన్ 14 (బీబీఎంఏ న్యూస్): పశువుల ఆరోగ్య పరిరక్షణలో టీకాలు అత్యంత కీలకమైనవని, గాలికుంటు, గొంతువాపు, జబ్బవాపు, బ్రుసెలోసిస్ వంటి ప్రమాదకర అంటువ్యాధుల నుంచి రక్షణ పొందేందుకు సకాలంలో టీకాలు వేయించడం తప్పనిసరి అని పశుసంవర్ధక శాఖ నిపుణులు సూచిస్తున్నారు.

టీకాల ద్వారా ఒక పశువు నుంచి మరొక పశువుకు వ్యాధులు వ్యాపించకుండా నిరోధించవచ్చని, దీనివల్ల మందలో సమష్టి రోగనిరోధక శక్తి పెరుగుతుందని తెలిపారు. వ్యాధులు వచ్చిన తర్వాత చికిత్స కోసం అధిక ఖర్చు చేయాల్సి వస్తుందని, ముందస్తుగా టీకాలు వేయించడం ద్వారా రైతులు ఆర్థిక నష్టాలను నివారించవచ్చని పేర్కొన్నారు.

అలాగే ఆరోగ్యంగా ఉన్న పశువులే అధిక పాల దిగుబడిని ఇవ్వడంతో పాటు సంతానోత్పత్తి సామర్థ్యాన్ని మెరుగుపరుస్తాయని, దీంతో రైతుల ఆదాయం పెరిగే అవకాశం ఉంటుందని వివరించారు.

ప్రభుత్వ పశువైద్య శాఖ సూచించిన టీకాల షెడ్యూల్‌ను తప్పకుండా పాటించాలని, ఆరోగ్యంగా ఉన్న పశువులకే టీకాలు వేయించాలని సూచించారు. టీకా వివరాలను నమోదు చేసుకోవడంతో పాటు టీకా అనంతరం కొన్ని రోజుల పాటు పశువులకు తగిన పోషకాహారం, స్వచ్ఛమైన నీరు అందించి విశ్రాంతి కల్పించాలని తెలిపారు.

పశువుల ఆరోగ్య పరిరక్షణ ద్వారా రైతుల ఆర్థికాభివృద్ధి సాధ్యమవుతుందని, మరిన్ని వివరాల కోసం సమీప పశువైద్యులను సంప్రదించాలని సూచించారు.