పలు తండాల్లో తెల్లవారుజామున ముమ్మర తనిఖీలు 550 లీటర్ల బెల్లం పానకం ధ్వంసం.. గుడుంబా, నల్ల బెల్లం స్వాధీనం

నర్సింహులపేట, జూన్ 14 (బీబీఎంఏ న్యూస్): జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు నర్సింహులపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని పలు తండాల్లో పోలీసులు తెల్లవారుజామున విస్తృత స్థాయిలో కార్డన్ అండ్ సెర్చ్ నిర్వహించారు. అక్రమ గుడుంబా తయారీ, అసాంఘిక కార్యకలాపాల నియంత్రణ లక్ష్యంగా చేపట్టిన ఈ తనిఖీల్లో భారీగా గుడుంబా తయారీ సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు.
ఉదయం 5 గంటల నుంచి 7 గంటల వరకు ఏకకాలంలో నిర్వహించిన ఈ ప్రత్యేక తనిఖీలకు తొర్రూరు డీఎస్పీ నాయకత్వం వహించగా, సీఐ పర్యవేక్షణలో పలువురు ఎస్‌ఐలు, సర్కిల్ సిబ్బంది పాల్గొన్నారు.
గోప తండా, వాస్రం తండా, మూడ్ తండా, జగ్గు తండా, లాలి తండాల్లో విస్తృతంగా సోదాలు నిర్వహించారు. ఈ సందర్భంగా సుమారు 550 లీటర్ల బెల్లం పానకాన్ని ధ్వంసం చేయడంతో పాటు 32 లీటర్ల గుడుంబా (నాటు సారాయి), 50 కిలోల నల్ల బెల్లం, 3 కిలోల పట్టికను స్వాధీనం చేసుకున్నారు.
స్వాధీనం చేసుకున్న వస్తువులకు సంబంధించి నిందితులపై కేసులు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు బానోతు వెంకన్న తెలిపారు.