తెలంగాణ సిద్ధాంతకర్త ఆచార్య ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ జయంతి సందర్భంగా గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ 15వ డివిజన్ గొర్రెకుంట క్రాస్ వద్ద ఏర్పాటు చేసిన ఆయన విగ్రహానికి పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... తెలంగాణ రాష్ట్ర సాధనలో ఆచార్య జయశంకర్ చేసిన త్యాగాలు, అందించిన సిద్ధాంతపరమైన మార్గదర్శకత్వం చిరస్మరణీయమని అన్నారు. పరకాల నియోజకవర్గంలోని ఆత్మకూరు మండలం అక్కంపేట గ్రామంలో జన్మించిన జయశంకర్ తెలంగాణ సమాజానికి దిశానిర్దేశం చేసిన మహనీయుడని కొనియాడారు. ఆయన ఆశయాలు, విలువలను కొనసాగిస్తూ తెలంగాణ సమగ్ర అభివృద్ధికి ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతతో కృషి చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొని ఆచార్య జయశంకర్ సార్ విగ్రహానికి పూలమాలలు సమర్పించి ఘనంగా నివాళులర్పించారు. తెలంగాణ ఉద్యమ చరిత్రలో ఆయన సేవలు చిరస్థాయిగా నిలిచిపోతాయని పలువురు పేర్కొన్నారు.