ముత్తారం, ఆగస్టు 6 (బీబీఎంఏ న్యూస్):
ప్రజా సమస్యల పరిష్కారంలో అధికారులు క్షేత్రస్థాయిలో పనిచేస్తూ బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష సూచించారు. గురువారం ముత్తారం ఎంపీడీవో కార్యాలయంలో నిర్వహించిన మండల సర్వసభ్య సమావేశంలో పాల్గొన్న ఆయన వ్యవసాయం, విద్య, వైద్యం, తాగునీరు, ఐసీడీఎస్, పంచాయతీరాజ్, నీటిపారుదల, విద్యుత్, ఉద్యానవనం, రవాణా, ఆర్‌అండ్‌బీతో పాటు వీబీజీ–రామ్‌జీ పనుల పురోగతిని సమీక్షించారు. మిషన్ భగీరథ గ్రిడ్, ఇంట్రా పైప్‌లైన్ వ్యవస్థలో ఉన్న లోపాలపై సమగ్ర నివేదిక రూపొందించి కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. విద్యుత్ అంతరాయం లేకుండా ట్రాన్స్‌ఫార్మర్ల మరమ్మతులు, అవసరమైతే కొత్త ట్రాన్స్‌ఫార్మర్ల ఏర్పాటు చేపట్టాలని సూచించారు. రైతులకు ఆయిల్‌పామ్ సాగుపై అవగాహన కల్పించడం, యూరియా సరఫరా పకడ్బందీగా నిర్వహించడం, సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహించాలని తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో నాణ్యమైన వైద్య సేవలు, మందుల లభ్యత, వైద్యుల సమయపాలనపై దృష్టి పెట్టాలని ఆదేశించారు. జలసిరి కార్యక్రమంలోని ఇంకుడు గుంతలు, పంటకుంటలు తదితర అభివృద్ధి పనులను నిర్ణీత గడువులో పూర్తి చేసి ప్రజలకు ప్రయోజనం చేకూరేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.