గద్వాల్, జూన్ 14 (బీబీఎంఏ న్యూస్): గద్వాల్ టౌన్ పోలీస్ స్టేషన్‌లో క్రైమ్ డిటెక్షన్ విభాగంలో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ చంద్రయ్య తన అంకితభావం, కష్టపడి పనిచేసే తత్వంతో ప్రజల ప్రశంసలు అందుకుంటున్నారు. గత ఐదేళ్లుగా ఒకే విభాగంలో కొనసాగుతూ అనేక క్లిష్టమైన కేసులను ఛేదించడంలో కీలక పాత్ర పోషించిన ఆయన సేవలను స్థానికులు కొనియాడుతున్నారు.
దొంగతనాలు, మిస్సింగ్ కేసులు, హత్య కేసుల దర్యాప్తులో చంద్రయ్య చూపుతున్న చొరవ పోలీసు శాఖపై ప్రజల విశ్వాసాన్ని మరింత పెంచుతోందని పలువురు అభిప్రాయపడుతున్నారు. బాధితుల సమస్యలను సొంత సమస్యలుగా భావించి, ఎస్‌ఐల మార్గదర్శకత్వంలో కేసుల దర్యాప్తును వేగవంతం చేస్తూ అనేక కేసుల్లో కీలక ఆధారాలను సేకరించి నిందితులను గుర్తించడంలో సఫలమయ్యారు.
ముఖ్యంగా ఫ్లైఓవర్ హత్య కేసు దర్యాప్తులో రాత్రింబవళ్లు శ్రమించి, వందల గంటల సీసీ కెమెరా ఫుటేజీలను పరిశీలించడం ద్వారా నిందితుడిని గుర్తించడంలో కీలక పాత్ర పోషించినట్లు సహచరులు పేర్కొంటున్నారు.
అలాగే ఓ మైనర్ బాలిక అదృశ్యమైన కేసులో సీసీ కెమెరాల ఆధారంగా ఆమె ప్రయాణ మార్గాన్ని గుర్తించి, హైదరాబాద్‌లో ఆమెను సురక్షితంగా గుర్తించి కుటుంబ సభ్యులకు అప్పగించడంలోనూ ఆయన కృషి విశేషంగా నిలిచింది.