మంచిర్యాల, జూన్ 14 (బీబీఎంఏ న్యూస్): తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో ఉద్యమ కళాకారులు పోషించిన పాత్ర అపూర్వమైందని, వారి త్యాగాలు మరియు కృషి తెలంగాణ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతాయని గడ్డం వంశీకృష్ణ అన్నారు.
ఆదివారం మంచిర్యాల జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ ఆడిటోరియంలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకల సందర్భంగా నిర్వహించిన ఉద్యమ కళాకారుల సన్మాన సభలో ఎంపీ పాల్గొని కళాకారులను శాలువాలతో సత్కరించి అభినందించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని గ్రామీణ ప్రాంతాల వరకు తీసుకెళ్లడంలో ఉద్యమ కళాకారుల పాత్ర కీలకమైందన్నారు. పాటలు, నృత్యాలు, సాంస్కృతిక కార్యక్రమాల ద్వారా ప్రజల్లో చైతన్యం నింపి ఉద్యమ విజయానికి వారు విశేషంగా దోహదపడ్డారని కొనియాడారు.
రాష్ట్ర ప్రభుత్వం ఉద్యమ కళాకారుల సంక్షేమానికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని, వారి అభ్యున్నతి కోసం చేపడుతున్న కార్యక్రమాలు ప్రశంసనీయమని పేర్కొన్నారు. తెలంగాణ సాధన కోసం పోరాడిన ప్రతి ఒక్కరి సేవలను గుర్తుంచుకోవడం సమాజ బాధ్యత అని అన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్, ఇతర అధికారులు, ప్రజాప్రతినిధులు, ఉద్యమ కళాకారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.