నవీన్ మృతితో గుర్తురు గ్రామంలో విషాద ఛాయలు

తొర్రూరు, జూన్ 14 (బీబీఎంఏ న్యూస్): తొర్రూరు–నర్సంపేట ప్రధాన రహదారిపై ఆదివారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో తొర్రూరు మండలం గుర్తురు గ్రామానికి చెందిన నవీన్ అనే యువకుడు దుర్మరణం చెందాడు. ఈ ఘటనతో గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి.

స్థానికుల కథనం ప్రకారం, నవీన్ తన ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తుండగా ప్రమాదవశాత్తు బైక్ అదుపుతప్పి రోడ్డుపై పడిపోయింది. ప్రమాదం తీవ్రతకు అతని తలకు తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలిపారు. ప్రమాదంలో బైక్ పూర్తిగా ధ్వంసమైంది.

సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.

నవీన్ ఆకస్మిక మృతితో కుటుంబ సభ్యులు, బంధువులు, గ్రామస్థులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. గ్రామంలో విషాద వాతావరణం నెలకొంది.